ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి వీలుగా ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఏ4గా చేర్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత, కోర్టు ఆదేశాల మేరకు జులై 19న సిట్ విచారణకు హాజరైన ఆయనను అదే రోజు రాత్రి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
బెయిల్, షరతులు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీగా తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నందున బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి కోర్టును కోరారు. అయితే, సిట్ అధికారులు దీనిని వ్యతిరేకించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికను సాకుగా చూపి బెయిల్ అడగడం సముచితం కాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం, మిథున్ రెడ్డి సెప్టెంబర్ 11న సాయంత్రం ఐదు గంటలలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కావాలి. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది.





