హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం కాముని చెరువు, మైసమ్మ చెరువులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, హైడ్రా ఏర్పాటుకు ముందున్న నిర్మాణాల జోలికి తాము మెళ్లబోమని స్పష్టత ఇచ్చారు. జులై తర్వాత.. అంటే హైడ్రా ఏర్పాటుకు తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. అనుమతులు ఉన్నవాటికి ఎలాంటి ఇబ్బంది కలగదని, అయితే అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలు తప్పక కూల్చివేస్తామన్నారు.
కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకే హైడ్రా పని చేస్తుందని రంగనాథ్ స్పష్టం చేశారు. పేదవాళ్లు, చిన్నవాళ్లకు హైడ్రా ఇబ్బంది కలిగించబోదని, ఆ విషయంలో తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






