భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌సాగర్ సరస్సు వద్ద ఉన్న రఫల్స్ హోటల్ ఈ వేడుకకు వేదికైంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రత్యేక అతిథుల సమక్షంలో రాత్రి 11.20 గంటలకు సాయి-సింధు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సంప్రదాయ మేళతాళాలతో జరిగిన ఈ వేడుక ప్రత్యేక ఆహ్లాదాన్ని కలిగించింది. హైదరాబాద్‌లో మంగళవారం రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.





