మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయింది. మన్మోహన్ సింగ్ దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారు. ఆయన మరణం బాధాకరం. అనేక ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు దేశానికి మేలుచేసిన నేతగా ఆయన గుర్తింపుపొందారు” అని వ్యాఖ్యానించారు. అయన దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారని చంద్రబాబు కొనియాడారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టాలు మన్మోహన్ హయాంలో తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు.





