ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో రోహిత్ కేవలం 31 పరుగులు మాత్రమే సాధించడం.. ఒక్కసారి కూడా డబుల్ డిజిట్ స్కోరు చేరుకోలేకపోవడం క్రికెట్ ప్రియుల్ని నిరాశకు గురి చేసింది. మరోవైపు, విరాట్ కోహ్లీ (Virat Kohli) 4 మ్యాచుల్లో 167 పరుగులు చేసి ఒక సెంచరీ సాధించాడు. అయితే, కోహ్లీ కూడా మిగతా మ్యాచుల్లో అంతగా ప్రభావం చూపించలేదు. అయితే, రోహిత్‌తో పోలిస్తే కోహ్లీ ఫిట్‌నెస్‌లో మెరుగ్గా ఉన్నాడు. ఆఫ్‌సైడ్ బంతిని ఆడే బలహీనతను వదిలిస్తే, కోహ్లీ మరికొంతకాలం జట్టులో తన స్థానాన్ని ఉంచుకోగలడు.
విరాట్ కోహ్లీకి మళ్లీ కెప్టెన్సీ?
మెల్బోర్న్ టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కనిపిస్తాడా లేదా రోహిత శర్మనా? అని చూసేవారికి అనిపించింది. ఫీల్డింగ్ సెటప్ మరియు బౌలర్లకు సూచనలు ఇవ్వడంలో కోహ్లీ చురుగ్గా కనిపించాడు. దీంతో, కోహ్లీ మళ్లీ జట్టు సారథ్యం తీసుకుంటాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.
మైకెల్ క్లార్క్ వ్యాఖ్యలు
మెల్బోర్న్ టెస్టులో విరాట్ కోహ్లీకి సామ్ కొన్‌స్టాస్ తో స్వల్ప వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఐసీసీ 20 శాతం జరిమానా విధించింది. అయితే, ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ మాత్రం కోహ్లీని వెనకేసుకొచ్చాడు. “విరాట్ గురించి నాకు బాగా తెలుసు. మ్యాచ్ ముగిసాక కొన్‌స్టాస్‌తో విరాట్ మాట్లాడాడు. అందుకే కోహ్లీ గొప్ప,” అని క్లార్క్ అన్నారు.





