ఫార్ములా-ఈ రేస్ కేసులో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆయన గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు మోహరించారు. బాష్పవాయువు, వాటర్‌కెనాన్ వాహనాలను సిద్ధంగా ఉంచారు.
విదేశీ నిధుల బదిలీపై విచారణ
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఖాతా నుంచి రూ.45.7 కోట్ల నిధులు విదేశీ సంస్థకు బదిలీ కావడంపై ఈడీ ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారంలో అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిల వాంగ్మూలాలను ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగుతోంది. ఫార్ములా-ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తున్న సమయంలో, ఆర్బీఐ అనుమతి లేకుండా నిధుల బదిలీ వ్యవహారంపై ఈడీ ప్రత్యేకంగా కేసు నమోదు చేసింది.
కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఈడీ కార్యాలయం వద్ద కేటీఆర్ అనుచరులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తోపులాట చోటుచేసుకుంది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విచారణకు ప్రాధాన్యం
కేటీఆర్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు తిరస్కరించిన ఈ పిటిషన్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను “డిస్మిస్డ్ యాజ్ విత్‌డ్రాన్”గా ప్రకటించింది. ఈ తీర్పు అనంతరం కేటీఆర్ ఈడీ ఎదుట విచారణకు హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.






