కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు నివాస స్థలాలను ఉచితంగా కేటాయించనున్నట్లు ప్రకటించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బీపీఎల్ కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతాయి. మంత్రివర్గం శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో దీనిని వెల్లడించారు.
గత తప్పుడు కేటాయింపులకు సమీక్ష
గత ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాలు ముంపు ప్రాంతాల్లో ఉండటంతో, వాటి కేటాయింపులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా అర్హతగల వారికి స్థలాలను కేటాయించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. కాలనీలలో నిర్మాణాలు పూర్తి కాని లబ్ధిదారులకు కూడా కొత్తగా పట్టాలు ఇస్తామని వివరించారు.
స్థలాల కేటాయింపుకు నిబంధనలు
- గరిష్ఠంగా 5 ఎకరాల్లోపు మెట్టభూమి లేదా 2.5 ఎకరాల్లోపు మాగాణి ఉన్నవారికి మాత్రమే అర్హత.
- కేంద్ర పథకాల ఆధారంగా మౌలిక వసతులు కల్పిస్తారు.
- కేటాయింపులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.





