దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భారత్ ఏకతాటిపై నిలిచిందని, మొదటిసారి ఒకే వేదికపై భారతీయ రాష్ట్రాలు కలిసి పెట్టుబడుల కోసం పాటుపడ్డాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భిన్నమైన రాజకీయ విధానాలు, ఆకాంక్షలున్నా ‘ఇండియా ఫస్ట్’ అనే నినాదంతో అన్ని రాష్ట్రాలు కలిసి పని చేశాయని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశానికి స్వర్ణయుగం ప్రారంభమైందని, భారత్ ప్రపంచం మొత్తానికి టెక్నాలజీని అందజేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత ప్రాధాన్యం – గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ
చంద్రబాబు గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారత్ విశేష ప్రాధాన్యం సాధిస్తున్నదని పేర్కొన్నారు. “భారత యువత దక్షత, జనాభా, వ్యాపార నైపుణ్యం వంటి అంశాలు భారత్‌కు వరాలుగా మారాయి. ప్రపంచంలోని సీఈవోలలో అనేక మంది భారతీయులే ఉన్నారు” అని ఆయన తెలిపారు. అలాగే, భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తోందని, ఆంధ్రప్రదేశ్ ఇందులో 165 గిగావాట్ల ఉత్పత్తిని సాధించాలనే సంకల్పంతో ఉన్నదని చెప్పారు.
ఐకాన్‌గా చంద్రబాబు!!
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ చంద్రబాబును ‘టెక్నాలజీ మ్యాన్’ అని అభివర్ణించారు. “సాంకేతికతను ముందుగా అందిపుచ్చుకోవడంలో ఆయన దృష్టి అనితర సాధ్యం. పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు గొప్ప విజయాలు సాధించారు” అని ఫడణవీస్ పేర్కొన్నారు.






