75 ఏళ్ల ప్రజాస్వామిక ప్రస్థానం.. ఈసీ వజ్రోత్సవ సంబరాలు!!

భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పునాది వేసిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) 1950, జనవరి 25న ఏర్పాటైంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా నిలిచే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ నుంచి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకూ ఈసీ కీలక పాత్ర పోషించింది. అక్షరాస్యత తక్కువగా ఉన్న మొదటి ఎన్నికల నుంచి అత్యాధునిక ఈవీఎంల ఆధారంగా ఎన్నికలను నిర్వహించే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా టి.ఎన్‌.శేషన్‌ వంటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఆచరణలో చూపిన కట్టుదిట్టమైన నిబంధనలు, పారదర్శకతకు ఈసీ ప్రతిరూపంగా నిలిచింది.

చరిత్రపుటల నుంచి అభివృద్ధి వరకు

1952లో తొలిసారిగా సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన తొలి ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ సేవలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అప్పటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈసీ విజయవంతమైన ఎన్నికల నిర్వహణను ప్రదర్శించింది. నేడు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అనేక ఆధునిక విధానాలను అవలంభించి, దేశవ్యాప్తంగా ఈసీ తన సత్తాను చాటుతోంది. అయితే, ఈవీఎంల పైనే కాదు, ఓటర్ల జాబితా తారుమారుకు సంబంధించి ఆరోపణలు ఈసీ ప్రతిష్టపై ప్రశ్నార్థకంగా మారాయి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై రాజకీయ పార్టీల ఆరోపణలు, ఎన్నికల కమిషనర్ల నియామకంపై వివాదాలు, సమయానికి సరైన వివరణలు ఇవ్వకపోవడం ఈసీపై ప్రజలు, విపక్షాల నుండి పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనాలు.

76వ వార్షికోత్సవ వేడుకలు

హస్తినలో శనివారం జరగనున్న ఈసీ 76వ వార్షికోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి అవార్డులు అందజేయడం, ‘ఇండియా వోట్స్‌ – 2024’ అనే కాఫీ టేబుల్‌ బుక్‌, ‘బిలీఫ్‌ ఇన్‌ ద బ్యాలెట్‌’ కథనాల కూర్పును విడుదల చేయడం, ‘ఇండియా డిసైడ్స్‌’ పేరుతో డాక్యుమెంటరీ ప్రదర్శన జరగనున్నాయి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *