జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ విడుదల చేశారు. తప్పుడు వార్తలు, కూటమి అంతర్గత అంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా చర్చించడం మానుకోవాలని, సోషల్ మీడియా వేదికగా అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. కూటమి ఆశయాన్ని కాపాడేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.
స్వర్ణాంధ్ర లక్ష్యాలకు జనసేన కృషి
లేఖలో, 2047 నాటికి స్వర్ణాంధ్ర దిశగా 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ ఎదగడం లక్ష్యమని పవన్ పేర్కొన్నారు. “నేను పదవుల కోసం రాజకీయం చేయడం లేదు. పుట్టిన నేల అభివృద్ధి కోసం మాత్రమే కృషి చేస్తున్నాను. ప్రతి కార్యకర్త ఈ ఉద్దేశాన్ని గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని నిలబెట్టేలా ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు. మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున భవిష్యత్తు లక్ష్యాలపై చర్చించనున్నట్లు ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-తెదేపా-భాజపా కూటమిగా ఎన్డీయే 164 స్థానాలు గెలుచుకోవడాన్ని చారిత్రాత్మక విజయం అని పవన్ అభివర్ణించారు. వైకాపా నిరంకుశ పాలన, అవినీతి, శాంతి భద్రతల వైఫల్యాలు ప్రజలను విసిగించాయని, అదే కారణంగా ప్రజలు స్థిరమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని వివరించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి
ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కృషి జరుగుతోందని పవన్ తెలిపారు. గత 7 నెలల్లో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించామని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమ హామీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వివరించారు. “ఈ విజయాన్ని పెద్ద బాధ్యతగా భావిస్తూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం” అని పవన్ స్పష్టం చేశారు.






