ప్రధాన ఘాట్ల వద్ద రద్దీ నియంత్రణ, వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు, ఇతర రాష్ట్రాల వాహనాలకు ప్రవేశం నిషేధం.
ప్రపంచంలోని అతిపెద్ద మత సంస్కృతి ఉత్సవమైన మహా కుంభమేళా 2025 ఈసారి ప్రయాగ్ రాజ్‌లో మరింత క్రమబద్ధంగా, భక్తులకు మరింత సౌకర్యంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పలు కీలక మార్పులను చేపట్టింది. ఉత్సవంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో, రవాణా, భద్రత, వసతి వంటి అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రధాన ఘాట్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు, వృద్ధులు, వికలాంగులు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
రవాణా, భద్రత కోసం ప్రత్యేక మార్గదర్శకాలు
ఉత్సవాన్ని మరింత సజావుగా నిర్వహించేందుకు ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేయనున్నారు. భక్తులు తమ వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లో పార్క్ చేసి, ప్రత్యేక బస్సులు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా ఘాట్లను చేరుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇతర రాష్ట్రాల వాహనాలకు అనుమతి నిరాకరించారు. ఈసారి వన్ వే రూట్ విధానం అమలు చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. మరో ప్రధాన నిర్ణయం ఏమిటంటే, ఈసారి వీఐపీ పాస్‌లు రద్దు చేశారు. ఈ నిర్ణయంతో అన్ని వర్గాల భక్తులకు సమాన అవకాశం లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.






