హ్యూస్టన్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం, జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో వెంటనే సిబ్బంది అప్రమత్తమై అత్యవసర తలుపులను తెరిచి, ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్ల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా దించేశారు.ఈ ఘటనలో 104 మంది ప్రయాణికులు, 5 మంది సిబ్బంది ఉన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పివేశారు. హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.ఇటీవల అమెరికాలో జరిగిన రెండు విమాన ప్రమాదాల తరువాత, ఈ ఘటన ప్రయాణికుల భయాన్ని పెంచింది. ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ ప్రమాదాలకు గల కారణాలపై దర్యాప్తు వేగవంతం చేసింది.





