“సినిమా ప్రమోషన్‌ ఖర్చు తప్పదు.. కానీ పక్కనోళ్లను తొక్కడం అవసరమా?”:నాగచైతన్య

టాలీవుడ్‌ హీరో నాగచైతన్య చిత్ర పరిశ్రమలోని పీఆర్‌ (ప్రెస్‌ రిలేషన్) వ్యవహారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రమోషన్‌ కోసం ప్రస్తుతం అందరూ పీఆర్‌లను నియమించుకుంటున్నారని, దీనిపై తన దృష్టి ఆలస్యంగా వెళ్లిందని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా ద్వారా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం తప్పనిసరి అయితే, కావాలని అనవసర ప్రచారాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

“ప్రతి నెలా మూడు లక్షలు ఖర్చు పెట్టకపోతే?”

తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ – “పీఆర్‌ గేమ్‌లోకి నేను ఆలస్యంగా వచ్చాను. నాకు రాజకీయాలు తెలియవు. కానీ ఇప్పుడు చూస్తుంటే, ప్రతి నెలా రూ.3 లక్షలు ఖర్చు పెట్టకపోతే సరైన దారిలో లేనట్టు భావిస్తున్నారు. సినిమా రాబోతుందంటే పీఆర్‌ ఖర్చు తప్పనిసరి. కానీ కొంతమంది కావాలని అనవసర ప్రచారాలు చేసి, పక్కనోళ్లను తొక్కడానికి ప్రయత్నిస్తారు. అసలు ఆ డబ్బుతో మన ఎదుగుదల కోసం పెట్టుకోవచ్చు, లేక ఇష్టమైన చోట విహారయాత్రలు చేసుకోవచ్చు కదా?” అని ప్రశ్నించారు.

వ్యక్తిగత జీవితం గురించిన వ్యాఖ్యలు

ఇదే ఇంటర్వ్యూలో తన మాజీ భార్య సమంతతో విడాకుల గురించి నాగచైతన్య స్పందించారు. “విడాకులు అనేది ఒక రోజు నిర్ణయం కాదు. చాలా కాలం చర్చించి, అర్థం చేసుకుని తీసుకున్న నిర్ణయం. కానీ మా విడాకులు ఇతరులకు వినోదంగా మారిపోయాయి. నాపై వచ్చిన గాసిప్స్, నెగటివ్‌ కామెంట్లు ఇకనైనా ఆపండి. మీ భవిష్యత్‌ గురించి ఆలోచించండి” అని ఆయన అన్నారు. ప్రస్తుతం నాగచైతన్య నటించిన ‘తండేల్‌’ మంచి విజయం సాధిస్తూ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *