- రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదని హెచ్చరిక
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుపై దృష్టి
వైకాపా నేతలు అధికారంలో లేకపోయినా అరాచకాలు మాత్రం మానలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ముఖ్యనేతలతో మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యకర్తల సంక్షేమం, అక్రమ కేసుల తొలగింపు, పెండింగ్ బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. వల్లభనేని వంశీ అరెస్టు, గన్నవరం తెదేపా కార్యాలయ ఉద్యోగిని సత్యవర్ధన్‌ను అపహరించడం, బెదిరించడం వంటి పరిణామాలపై నేతలు చంద్రబాబుకు వివరించగా, దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, చట్టప్రకారం శిక్షపడుతుందని స్పష్టం చేశారు.
‘జగన్ హయాంలో నేర పాలన.. ఇక ఉపేక్షించం’
‘జగన్ హయాంలో మాదకద్రవ్యాలు, గంజాయి, హత్యలు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయి. దీనికి ఇక స్వస్తి. దళితుల పక్షపాతి అంటూ హేమాహేమీలైన వారిని వేధించారు. సత్యవర్ధన్‌ను అపహరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించడమేంటి? ఇది ఎంతటి దారుణం?’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అత్యంత ప్రాధాన్యమని చెబుతూ, కూటమి అభ్యర్థుల విజయాన్ని ఖాయం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ గెలవాల్సిందే అని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగనున్న ఎన్నికల కోసం విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ లతో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.





