- దిల్లీ, బిహార్‌లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచన
దేశ రాజధాని దిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం 5:36 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత గా నమోదైంది. ధౌలా ఖాన్ సమీపంలో 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూప్రకంపనల సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దిల్లీలో భూకంపం సంభవించిన గంటల వ్యవధిలోనే ఉదయం 8:02 గంటలకు బిహార్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. సివాన్‌లో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
ప్రజలకు ప్రధాని మోదీ సూచన
భూప్రకంపనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రజల భద్రత కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దిల్లీ పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్ 112 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో మరోసారి భూప్రకంపనలు సంభవించవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.





