- ఏడో తరగతి బాలికపై టెన్త్ విద్యార్థినుల దాడి. ముగ్గురు విద్యార్థినులను హాస్టల్ నుండి ఇంటికి పంపిన అధికారులు.
- విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు, ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం.
అల్లూరి జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం రేగింది. ఏడో తరగతి చదువుతున్న ఓ బాలికపై పదో తరగతి విద్యార్థినులు దాడి చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కలెక్టర్ దినేష్ కుమార్ సీరియస్‌గా స్పందించారు.
విచారణకు ఆదేశించిన కలెక్టర్
పాఠశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావును కలెక్టర్ ఆదేశించారు. దీంతో డీఈవో వెంటనే పాఠశాల మరియు వసతి గృహాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. హాస్టల్ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా లేదా అనే దానిపై ఆరా తీశారు. నివేదిక ఆధారంగా వసతి గృహ కేర్ టేకర్ శ్రావ్యను విధుల నుంచి తొలగించారు. దాడికి పాల్పడిన ముగ్గురు టెన్త్ విద్యార్థినులను హాస్టల్ నుంచి ఇళ్లకు పంపించివేశారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని డీఈవో హెచ్చరించారు.





