ఉపాధ్యాయుల బదిలీలలో వివాదాలొద్దు!!: మంత్రి నారా లోకేశ్

  • జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలో ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించనున్నారు.
  • జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యలపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన ఉపాధ్యాయుల బదిలీలలో వివాదాలకు తావు లేకుండా సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలో ప్రజాప్రతినిధుల సదస్సు నిర్వహించి వారి సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు. జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేశ్ తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే లెక్చరర్ల బదిలీలు చేపట్టాలని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 42 వల్ల 80 ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయని ఆయన మండిపడ్డారు.

విద్యార్థుల భవిష్యత్తుకు దృష్టి

ఈ సందర్భంగా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీవో 42 ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని తేల్చి చెప్పారు. నైపుణ్య గణన కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ఈ నెల 20వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *