- పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం ప్రారంభం కానుంది, పాకిస్థాన్-న్యూజిలాండ్ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కానుంది.
- డిఫెండింగ్ ఛాంపియన్‌గా పాకిస్థాన్ బరిలోకి దిగుతోంది, భారత్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
చిన్న జట్లతో విసుగు కలిగించే మ్యాచ్‌లు లేకుండా, బలమైన జట్ల మధ్య పోరుతో ఛాంపియన్స్ ట్రోఫీ అభిమానులకు కనువిందు చేయనుంది. ఈ టోర్నీ కేవలం 19 రోజుల్లో 15 మ్యాచ్‌లతో ముగుస్తుంది, ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. అందుకే దీనిని మినీ ప్రపంచకప్‌గా పిలుస్తారు. ఈ టోర్నీ బుధవారం ప్రారంభం కానుండగా, పాకిస్థాన్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మినీ వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఆతిథ్యమిస్తుంది పాకిస్థానే అయినప్పటికీ, అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న టీమిండియా టైటిల్ ఫేవరెట్లలో ఒకటని చెప్పడంలో సందేహం లేదు. 1996లో వన్డే ప్రపంచకప్‌నకు భారత్, శ్రీలంకలతో కలిసి పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత ఆ దేశంలో ఏ ఐసీసీ టోర్నీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను పాక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సొంతగడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న ఆ జట్టు టోర్నీలో శుభారంభం చేయాలని ఆశిస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ రూపంలో ఆ జట్టుకు కఠిన సవాలే ఎదురవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా జరిగిన ముక్కోణపు సిరీస్‌లో కివీస్ పాక్‌ను లీగ్ దశలోనే కాక ఫైనల్లోనూ ఓడించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్ర
చివరిసారిగా జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ టైటిల్ విజేతగా నిలిచింది. 2008లో శ్రీలంకపై ఉగ్ర దాడి తర్వాత చాలా ఏళ్ల పాటు ఆ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లే జరగలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో పెద్ద టోర్నీని పాకిస్తాన్ నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా 8 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. తొలిసారి 1998లో బంగ్లాదేశ్ వేదికగా టోర్నీని నిర్వహించారు. 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన భారత్, 2013లో ఇంగ్లాండ్‌ను ఓడించి టైటిల్ సాధించింది. ఆస్ట్రేలియా రెండుసార్లు (2006, 2009) ఛాంపియన్ అయ్యింది. సౌతాఫ్రికా (1998), న్యూజిలాండ్ (2000), వెస్టిండీస్ (2004), పాకిస్థాన్ (2017) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.





