- నవ వధువు కూడా పరీక్ష రాసిన అరుదైన ఘటన
- పరీక్ష వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను తిరస్కరించిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, పోలీసులు మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన అనంతరం కేంద్రాలకు అనుమతించారు. తిరుపతిలో ఓ నవ వధువు తన పెళ్లి ముహూర్తం ముగిసిన వెంటనే పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్ష రాయడం ఆసక్తికరంగా మారింది. చిత్తూరులో పెళ్లి తంతు జరిగినప్పటికీ, పరీక్షకు ప్రాధాన్యత ఇస్తూ ఆమె తిరుపతిలోని శ్రీ పద్మావతి కళాశాలలో పరీక్ష రాసింది.
పరీక్ష వాయిదా నిర్ణయంపై ఏపీపీఎస్సీ స్పందన
కూటమి ప్రభుత్వం పరీక్ష వాయిదా వేయాలని సూచించినా, ఏపీపీఎస్సీ అనుకున్న సమయానికే పరీక్షలు నిర్వహించేందుకు మొగ్గుచూపింది. ప్రభుత్వ సూచనను తిరస్కరిస్తూ, వాయిదా వేస్తే అది శాసనమండలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, పరీక్ష వాయిదా విషయంలో అభ్యర్థుల అభిప్రాయాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. కొందరు అభ్యర్థులు తమకు సమయ పరిమితి లేకపోవడంతో పరీక్ష నిర్వహించడాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం వాయిదా వేసి మరింత సమయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.





