- జగన్ అహంకారం వల్లే ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు
- కూటమి ప్రభుత్వ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోంది
ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో 50 సంవత్సరాలు వెనుకబడి పోయిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అహంకార ధోరణి, లెక్కలేనితనం కారణంగా ప్రజలు వైఎస్సార్‌సీపీని 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా ఆ పార్టీ తన వైఖరిలో మార్పు తీసుకురావడం లేదని ఆయన విమర్శించారు. స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించిన రామ్మోహన్, ఎర్రన్నాయుడు బడుగు, బలహీన వర్గాల గొప్ప నాయకుడని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం చేయడం లేదని, జగన్‌కు ప్రతిపక్ష హోదా, జెడ్ ప్లస్ భద్రత లభించలేదని మాత్రం పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా సాగుతోందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మను గెలిపించాలని కోరారు. వైసీపీ ఏపీలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు కుట్ర పన్నుతుందని, అయితే అలాంటి ప్రయత్నాలను భరించబోమని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.





