- ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా
- ఎండీ దినేష్‌కుమార్‌పై ఆరోపణలు, బదిలీ ఉత్తర్వులు
ఏపీ ఫైబర్‌నెట్‌లో జరుగుతున్న వివాదం కారణంగా ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ దినేష్‌కుమార్ సంస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తిప్పుతున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి నష్టం కలిగేలా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, సంస్థ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం దినేష్‌కుమార్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు నివేదిక కోరారు. ఆరోపణలు బహిరంగంగా చేయడం సరికాదని జీవీ రెడ్డిని మందలించడంతో అలకపట్టి ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. అదే సమయంలో ఎండీ దినేష్‌కుమార్‌పై కూడా చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.





