- రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.
- గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యం.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. 3.22 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా 95.44 లక్షల గ్రామీణ గృహాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 18,847 కోట్ల రూపాయలు కేటాయించారు.
అమరావతికి ప్రత్యేక నిధులు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. అమరావతి రైతుల పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. రాజధాని పనులు త్వరలో ప్రారంభిస్తామని, రాష్ట్రాభివృద్ధికి అమరావతి గ్రోత్ ఇంజన్ లా పనిచేస్తుందని చెప్పారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ నుండి రూపాయి కూడా కేటాయించడం లేదని, కేంద్రం సహకారంతోనే నిధులు వస్తాయని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలలో చెత్త పన్ను రద్దు చేశామని, స్వచ్ఛాంధ్ర దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయానికి 48 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6,705 కోట్లు కేటాయించారు.






