“జనసేన ఆవిర్భావ సభ –కార్యకర్తలకు ఇది ఒక పెద్ద పండుగ!!”- మంత్రి నాదెండ్ల

  • పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ, 14న ఘనంగా
  • 254 మంది సభ్యులతో 14 కమిటీల ఏర్పాటు, ఏర్పాట్లకు సమన్వయం

జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించనున్నారు. పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో షష్టపడి పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ఇది ఒక పెద్ద పండుగ అని తెలిపారు. కాకినాడలోని కళాక్షేత్రంలో సన్నాహక సమావేశం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ప్రముఖ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సభ నిర్వహణ కోసం 254 మంది సభ్యులతో 14 కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 8న కాకినాడలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.

“జనసేన ప్రజల కోసం పోరాటం”

మాజీ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తూ, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాష్ట్రాన్ని దుర్మార్గ పాలనలోకి నెట్టేశాడు. అప్పుడు ప్రశ్నిస్తే కేసులతో భయపెట్టారు. కానీ జనసేన ప్రజల కోసం పోరాడింది” అని అన్నారు. అంతేకాక, కూటమి పరిపాలన మరో 15 ఏళ్లు కొనసాగించాలని పవన్‌ కల్యాణ్‌ చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. “అందరం కలిసి పనిచేద్దాం. ఎవరు పెద్ద, ఎవరు చిన్న అనేది ప్రశ్న కాదు” అని మనోహర్ అన్నారు.

“రాష్ట్రంలో చట్టబద్ధ పాలన మా లక్ష్యం”

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, “గత ప్రభుత్వ భావజాలం పూర్తిగా తుడిచిపెట్టలేదు. ఇప్పటికీ కొందరు అధికారులు అదే విధానం కొనసాగిస్తున్నారు” అని విమర్శించారు. జనసేన లక్ష్యం ప్రజాస్వామ్య పరిరక్షణ, చట్టబద్ధమైన పాలన అందించడం అని అన్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఇతర ఎమ్మెల్యేలు, నేతలు, జనసేన తెలంగాణ ఇన్‌ఛార్జి శంకర్ గౌడ్, ఇతర పార్టీ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆవిర్భావ సభ జరిగే చిత్రాడ వద్ద వేదిక నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *