- అనుమానంతో భార్య, ఆమె స్నేహితుడిని నరికి చంపిన భర్త.
- కేరళలోని పతనంతిట్ట జిల్లాలో దారుణ ఘటన.
కేరళలోని పతనంతిట్ట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను, ఆమె స్నేహితుడిని నరికి చంపాడు. ఈ ఘటనలో వైష్ణవి (28), ఆమె స్నేహితుడు విష్ణు (30) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
కిస్ ఎమోజీతో మొదలైన అనుమానం..
పతనంతిట్టలోని కలంజూరుకు చెందిన బైజు, తన భార్య వైష్ణవితో కలిసి నివసిస్తున్నాడు. వారి ఇంటి పక్కనే విష్ణు తన తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే, విష్ణు ఒకసారి వైష్ణవి వాట్సాప్కు కిస్ ఎమోజీ పంపాడు. అది చూసిన భర్త బైజు తన భార్యతో గొడవకు దిగాడు. భయంతో వైష్ణవి పక్కింట్లో ఉన్న విష్ణు ఇంటికి పారిపోయింది. కొడవలి పట్టుకుని ఆమెను వెంబడించిన బైజు, విష్ణు ఇంటికి చేరుకుని భార్యను బయటకు రమ్మని కేకలు వేశాడు. భయంతో వైష్ణవి బయటకు రాకపోవడంతో, ఆగ్రహించిన బైజు విష్ణు ఇంట్లోకి వెళ్లాడు. భార్యను పెరట్లోకి లాక్కెళ్లి కొడవలితో నరికాడు. అలాగే, బైజును ఆపడానికి పెరట్లోకి వెళ్లిన విష్ణును కూడా నరికాడు. ఈ దాడిలో విష్ణు, వైష్ణవి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన తర్వాత నిందితుడు బైజు స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. తన స్నేహితుడికి ఫోన్ చేసి హత్యల గురించి చెప్పాడు. పోలీసులకు బైజు స్నేహితుడు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వైష్ణవి, బైజు కొన్నాళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి పది, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. పొరుగింట్లో ఉన్న విష్ణు తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. బైజుతో కలిసి ప్రతిరోజు పనికి వెళ్లేవాడు. అయితే, తన భార్యకు వాట్సాప్లో కిస్ ఎమోజీ పంపాడన్న కోపంతో విష్ణును బిజు దారుణంగా కొడవలితో నరికి చంపాడు.





