- రాష్ట్ర ప్రజల్లో డిజిటల్ అవగాహన పెంచేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
- వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సదుపాయం సిద్ధం
రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ (RTGS), పీపుల్స్ పర్సెప్షన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం, ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన ఇంకా తక్కువగా ఉందని, గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకు వివరించేలా కలెక్టర్లు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా, నిరక్షరాస్యుల కోసం వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించే సదుపాయం త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. డిజిటల్ అక్షరాస్యత పెరిగితే, ప్రభుత్వం అందించే సేవలను మరింత ప్రభావవంతంగా ప్రజలు వినియోగించుకోగలరని చంద్రబాబు పేర్కొన్నారు.
ఒన్ స్టేట్, ఒన్ యాప్: ప్రభుత్వ సేవలన్నీ ఒకే ప్లాట్‌ఫాంలో!
రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా “ఒన్ స్టేట్, ఒన్ యాప్” విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు అన్ని సేవలను ఒకే ప్లాట్‌ఫాంలో లభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని RTGS కార్యదర్శి భాస్కర్ కాటంనేని వివరించారు. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా 200 రకాల సేవలు అందిస్తున్న ప్రభుత్వం, మరిన్ని సేవలను త్వరలో ప్రారంభించనుంది. మరోవైపు, అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రజల్లో 90% సంతృప్తి ఉందని, భోజనం రుచి, నాణ్యతపైనా 94% మంది సానుకూలంగా స్పందించారని అధికారులు సీఎంకు వివరించారు. ప్రజల్లో ఎక్కడ అసంతృప్తి వ్యక్తమవుతోందో గుర్తించి, తక్షణమే సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.





