రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించనున్న ప్రభుత్వం… ‘వన్ క్లాస్ – వన్ టీచర్’ విధానాన్ని 10 వేల పాఠశాలలకు విస్తరిస్తామని మంత్రి లోకేశ్
టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందించడంతో పాటు, బదిలీల కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ శాసనసభలో వెల్లడించారు. ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారిపై పనిభారం ఉంటే బోధన ప్రభావితమవుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐబీ స్కూళ్ల ఏర్పాటు కోసం రూ.5 కోట్లు ఖర్చు చేశారని విమర్శించిన లోకేశ్, తమ పాలనలో విద్యార్థుల భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం 1,400 స్కూళ్లలో అమలులో ఉన్న ‘వన్ క్లాస్ – వన్ టీచర్’ విధానాన్ని 10 వేల పాఠశాలలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్ అందజేస్తామన్నారు. విద్యా సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని, ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.





