14.8 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావు అరెస్ట్.. డీఆర్‌ఐ సోదాల్లో రూ.2 కోట్ల విలువైన బంగారు నగలు, 2.67 కోట్ల నగదు స్వాధీనం!!
బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావుపై దర్యాప్తులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. యూఏఈ నుంచి 14.8 కిలోల బంగారం అక్రమంగా రవాణా చేస్తుండగా ఆమెను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.14.56 కోట్లు ఉంటుందని అంచనా. గత ఏడాది 27సార్లు దుబాయ్ వెళ్లిన ఆమె, కేవలం 15 రోజుల్లోనే నాలుగుసార్లు వెళ్లటంతో అనుమానాస్పదంగా మారింది. ప్రతి ట్రిప్‌లో కిలోల కొద్ది బంగారం స్మగ్లింగ్ చేసినట్లు తేలింది.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన నిజాలు!
దర్యాప్తులో ఆమె భర్త జతిన్ హుక్కేరి కూడా కొన్నిసార్లు దుబాయ్ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఆయనపైనా పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్ట్ అనంతరం జరిగిన సోదాల్లో రూ.2 కోట్ల బంగారు ఆభరణాలు, 2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి రన్యారావు సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం పెళ్లయినప్పటి నుంచి ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.





