- “నా ఆస్తులపై జగన్ అన్యాయం చేశాడు!”
- “పవన్‌తో సినిమాలు తీయాలనుంది”
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులను జగన్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, తనకు జరిగిన అన్యాయం ఒక్కరోజు చెబితే సరిపోదని అన్నారు. “పిఠాపురం అమ్మవారి సాక్షిగా, నేను అన్నీ నిజాలే చెబుతా,” అంటూ జగన్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.
లోపల వేయించాల్సింది ఎవరు?
రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్టు చేయడం తప్పని, చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ జగన్ మౌనంగా ఉండటం విడ్డూరమన్నారు. “జగన్‌కు సీఎం పదవి ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి వల్లే వచ్చిందే తప్ప, తనకు వ్యక్తిగతమైన ప్రాముఖ్యత ఏమీలేదు” అని విమర్శించారు. తాను అయిదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు.
పవన్‌తో కలిసి ముందుకు!
జనసేనలో చేరడంలో ఆలస్యం తన దురదృష్టమని బాలినేని చెప్పారు. “పవన్ కల్యాణ్ ఎంతో గొప్ప మనిషి. ఆయనతో కలిసి రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలని ఉంది. అంతేకాకుండా, పవన్‌తో కలిసి సినిమాలు తీయాలనుంది” అని పేర్కొన్నారు. తాను పదవి కోసం పార్టీ మారలేదని, జనసేన కార్యకర్తల కష్టానికి తగిన గుర్తింపు రావాలని కోరారు.





