తొమ్మిది నెలల నిరీక్షణకు తెర – భూమికి రానున్న సునీతా విలియమ్స్!!

తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్ త్వరలోనే భూమికి రాబోతున్నారు. వీరిని భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా – స్పేస్‌ఎక్స్ కలిసి చేపట్టిన క్రూ-10 మిషన్‌ విజయవంతమైంది. ఆదివారం ఉదయం 9:37 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఈ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ISS) విజయవంతంగా అనుసంధానించింది. ఈ ఘట్టాన్ని స్పేస్‌ఎక్స్ వీడియో రూపంలో పంచుకుంది.

క్రూ-10 మిషన్ వివరాలు

సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్ స్థానంలో ఐఎస్‌ఎస్‌లో పనిచేయడానికి నలుగురు కొత్త వ్యోమగాములు వెళ్లారు. శనివారం తెల్లవారుజామున 4:33 గంటలకు (IST) అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వ్యోమనౌకలో అమెరికా, జపాన్, రష్యా దేశాలకు చెందిన ఆన్ మెక్‌క్లెయిన్, నికోల్‌ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్‌ పెస్కోవ్‌ ఉన్నారు. ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న వీరికి సునీతా విలియమ్స్, విల్మోర్ స్వాగతం పలికారు. 2024 జూన్ 5న బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ వ్యోమనౌక ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ISSలోకి ప్రవేశించారు. ప్లాన్ ప్రకారం వారంరోజులకే తిరిగి భూమికి రావాల్సి ఉంది. కానీ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే వ్యోమనౌక భూమికి చేరుకుంది. దీంతో సునీతా విలియమ్స్, విల్మోర్‌ తొమ్మిది నెలలుగా ఐఎస్‌ఎస్‌లోనే కొనసాగారు. తాజాగా, క్రూ-10 ద్వారా వీరు భూమికి తిరిగి రానున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *