అమెరికాను వణికిస్తున్న పెను తుపాన్ – 33 మంది మృతి!

అమెరికా (USA)ని పెను తుపాను, టోర్నడోలు కుదిపేస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 33 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. తుఫాన్‌ ప్రభావంతో గాలులు బలంగా వీచడంతో ఇళ్ల పైకప్పులు ఊడిపోయాయి. పెద్ద ట్రక్కులు, వాహనాలు బోల్తా పడటంతో రహదారులపై ప్రమాదకర పరిస్థితి నెలకొంది. కాన్సాస్‌లో జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో 50కి పైగా వాహనాలు ఢీకొని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మిస్సోరీలో 12 మంది, మిసిసిపీలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురి ఆచూకీ తెలియదు. టెక్సాస్‌లో వాహన ప్రమాదాల్లో నలుగురు చనిపోగా, ఆర్కాన్సాస్‌లో మరో ముగ్గురు మరణించారు. ఈ రాష్ట్రాల్లో చాలా మంది గాయపడ్డారు.

ప్రమాద తీవ్రత దృష్ట్యా ఆర్కాన్సాస్ గవర్నర్‌ సారా హుకాబీ శాండర్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుపాన్ ధాటికి విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో సెంట్రల్‌ యూఎస్‌లో దాదాపు 2 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జాతీయ వాతావరణ సేవల విభాగం (NWS) ఈ ప్రాంతాల్లో మరిన్ని టోర్నడోలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా టెక్సాస్, కాన్సాస్, దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మార్చిలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు సర్వసాధారణమే అయినా, ఈసారి తీవ్రత మరింత ఎక్కువగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *