- ఏదైనా వ్యాఖ్య చేసినంత మాత్రాన నేరమా? అని ప్రశ్నించిన పొన్నవోలు
- ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు వైకాపా నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణ
వైకాపా లీగల్ సెల్ నేత, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో “రూల్ ఆఫ్ లా” కంటే “రూల్ ఆఫ్ వెంజెన్స్” నడుస్తోందని, ప్రస్తుతం జరుగుతున్నది ట్రైలర్ మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత వైకాపా తిరిగి అధికారంలోకి వస్తే నిజమైన సినిమా చూపిస్తామని హెచ్చరించారు.
“కేవలం ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసినందుకే అరెస్టా?”
వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో మాట్లాడిన పొన్నవోలు, బొమ్మరాజుపల్లెకు చెందిన నాగేశ్వరరావు ప్రభుత్వంపై వ్యంగ్యంగా కామెంట్ చేశాడన్న కారణంతో అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. “ఇది ఏ రకమైన న్యాయమో?” అని ప్రశ్నించారు. ఈ అరెస్టును హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా సవాలు చేశానని తెలిపారు. అంతేకాదు, ఏనుగుపాలెంలో మహిళ హత్య కేసు ఏడాది దాటినా పోలీసులు దర్యాప్తును పూర్తిచేయలేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన వారిపై వేధింపులు మానుకోవాలని, లేదంటే భవిష్యత్తులో దాని అనర్ధాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.





