బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన స్వప్న ప్రాజెక్ట్ ‘మహాభారతం’ను తెరపైకి తీసుకొస్తానని సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారతీయ ఇతిహాసాన్ని నేటి తరానికి సిరీస్ రూపంలో అందించాలనే తన ఆశయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి రైటింగ్ పనులు ప్రారంభించనున్నట్లు, రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించేందుకు ఇండస్ట్రీలోని పలువురు టాప్ డైరెక్టర్లతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయాలని ఆమిర్ ఉద్ఘాటించారు.
మహాభారతం నా స్వప్న ప్రాజెక్ట్. దీన్ని సిరీస్‌గా తీసుకొస్తున్నాం. రైటింగ్‌కు సంవత్సరాలు పట్టవచ్చు, కానీ తప్పులు లేకుండా భారీ స్థాయిలో రూపొందిస్తాం. ఇది మన రక్తంలో ఉన్న కథ, ప్రపంచానికి మన గొప్పతనాన్ని చూపిస్తాం,” అని ఆమిర్ ఖాన్ ఉద్వేగంగా చెప్పారు.
గతంలో కూడా ఆమిర్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, దీన్ని రూపొందించడం తనపై భారీ బాధ్యతను మోపిందని, ఎలాంటి తప్పొప్పులూ లేకుండా చేయాలనే భయం ఉందని చెప్పారు. స్టోరీ రాసుకున్న తర్వాత నటీనటుల ఎంపిక జరుగుతుందని, తాను నటిస్తానా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. ఇటీవల బాలీవుడ్‌లో నితేశ్ తివారీ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మాణంలో ‘రామాయణ’ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న నేపథ్యంలో, ఆమిర్ ఖాన్ ‘మహాభారతం’ ప్రకటన సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. 2026, 2027లో ‘రామాయణ’ రెండు భాగాలు విడుదల కానుండగా, ఆమిర్ సిరీస్ ఎప్పటికి వస్తుందనే ఆసక్తి నెలకొంది.





