గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం (AI171) టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే మేఘనీ నగర్‌లోని బీజే వైద్య కళాశాలపై కూలి మంటల్లో దగ్ధమైంది. 242 మంది ప్రయాణికుల్లో ఒక్క విశ్వాస్ కుమార్ రమేష్ (40) మినహా అందరూ మృతి చెందారు. వైద్య కళాశాల హాస్టల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, విమానంలోని 1.25 లక్షల లీటర్ల ఇంధనం పేలడంతో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
1000 డిగ్రీల మంటలతో సహాయక చర్యలు క్లిష్టం, పక్షులు కూడా కాలిపోయాయి!
ఎస్డీఆర్ఎఫ్ అధికారి మాట్లాడుతూ, “మధ్యాహ్నం 2-2:30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నాం. స్థానికులు కొంతమందిని కాపాడారు, కానీ మంటలు వ్యాపించడంతో పరిస్థితి చేజారింది. ఇంధన ట్యాంక్ పేలడంతో అగ్నిగోళం ఏర్పడింది. పీపీఈ కిట్లు ధరించినా వేడి తీవ్రతతో సహాయక చర్యలు ఆగిపోయాయి” అన్నారు. మంటల ధాటికి పక్షులు, శునకాలు కాలిపోయాయని, శిథిలాల కింద కాలిన మృతదేహాలను గుర్తించడం సవాల్‌గా మారిందని వెల్లడించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో డీఎన్ఏ పరీక్షల ద్వారా కుటుంబాలకు అప్పగిస్తున్నారు. బ్లాక్ బాక్స్ డీకోడ్‌తో ప్రమాద కారణం తెలియనుంది.





