- దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తున్న టైమ్‌లో ఆసీస్ వాళ్ల నోటికి పని చెప్పారట
- స్లెడ్జింగ్‌తో ట్రై చేసినా… సఫారీ జట్టు మాత్రం గేమ్ ఫలితాన్ని మార్చేసింది
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఆసీస్‌ను ఓడించి, 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. అందరూ “చోకర్స్” అంటూ దాడి చేసిన జట్టే… ఇప్పుడు గర్వంగా గెలిచింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు దిగినట్లు సఫారీ కెప్టెన్ తెంబా బవూమా చెప్పాడు. ముఖ్యంగా నాలుగో రోజు, తాను మార్‌క్రమ్‌తో కలిసి మంచి భాగస్వామ్యం చేస్తుండగా… “చోకర్స్” అంటూ ఎదురుదాడి చేసినట్లు పేర్కొన్నాడు. ‘‘మేం నమ్మకంగా ఆడేందుకు వచ్చాం. కానీ ఆ పదం మళ్లీ మమ్మల్ని క్షణం తికమక పెట్టింది. అయినా ఆ మాటలు మన ఆటను ఆపలేకపోయాయి. ఈ గెలుపు మా దేశానికి ప్రేరణ ఇస్తుంది’’ అని బవూమా స్పష్టం చేశాడు.
ట్యాగ్ తొలగిపోయింది
ఈ విషయంపై స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా స్పందించాడు. ‘‘చాలా కాలంగా ‘చోకర్స్’ అన్న ట్యాగ్ మాతోనే ఉంది. కానీ ఇప్పుడు ఆ ట్యాగ్ చరిత్ర అయిపోయింది. ఇది మా కోసం, మా దేశం కోసం చాలా స్పెషల్ గెలుపు’’ అని చెప్పాడు. ఇక ఆసీస్ క్రికెట్‌ను చూస్తే… ఏ చిన్న అవకాశమొస్తే వదలదు. కానీ కొన్ని సందర్భాల్లో హద్దులు దాటి స్లెడ్జింగ్ చేయడం వాళ్ల అలవాటే. కమిన్స్ సారథ్యంతో మార్పులు వచ్చాయనుకున్నా… ఇప్పుడు మళ్లీ అదే స్టైల్ కనిపించడంపై విమర్శలు వచ్చాయి.





