- బ్రెజిల్‌లోని శాంటా కటారినా రాష్ట్రంలో హాట్ ఎయిర్ బెలూన్ కూలి 8 మంది చనిపోయారు.
- గాల్లో ఉండగానే మంటలు చెలరేగడంతో ఈ ఘోరం జరిగింది; 13 మంది సురక్షితం.
బ్రెజిల్‌లోని శాంటా కటారినా రాష్ట్రంలో శనివారం జరిగిన హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బెలూన్‌లో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. ప్రాతిక్ గ్రాండే నగరంలో తెల్లవారుజామున ఈ దురదృష్టకర ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బెలూన్ గాల్లో ఉండగానే మంటలు చెలరేగి, అదుపుతప్పి కిందకు కూలిపోయిందని అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదం నుండి 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాల్లో మండుతున్న బెలూన్ కిందకు దూసుకువస్తున్న భయానక దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.





