- అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దీపాన్షి భదౌరియా అనే లా విద్యార్థిని దుర్మరణం. పాలయ్యారు. తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం కోసం లండన్ తిరిగి వెళ్లే తేదీని మార్చుకుని, కుటుంబంతో సమయం గడిపిన ఆమె, చివరి సెల్ఫీతో తల్లిదండ్రులకు శాశ్వత జ్ఞాపకంగా మిగిలారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 21 ఏళ్ల దీపాన్షి భదౌరియా కూడా ఉన్నారు. లండన్ తిరిగి వెళ్లే తన విమాన టికెట్ తేదీని మార్చుకుని మరీ కుటుంబాన్ని కలుసుకోవాలని వచ్చిన ఆమె, అనూహ్యంగా ప్రమాదంలో చనిపోవడంతో గాంధీనగర్‌లోని ఉమియా మాత ఆలయంలో సంతాప సభ విషాదకరంగా మారింది.

కుటుంబంతో చివరి క్షణాలు
డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్.ఎస్. భదౌరియా కుమార్తె అయిన దీపాన్షి, ఎక్సెటర్ యూనివర్సిటీలో లా చదువుతోంది. ఆమె తన తండ్రి పుట్టినరోజుకు సర్ ప్రైజ్ ఇవ్వాలని మార్చి 27న స్వదేశానికి వచ్చింది. వాస్తవానికి మే 20నే తిరిగి లండన్ వెళ్లాల్సి ఉన్నా, తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం జూన్ 11న ఉండటంతో, దాన్ని వారిద్దరితో కలిసి జరుపుకోవాలని జూన్ 12కు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. ఈ దుర్ఖటన గురించి తన సన్నిహితుడొకరు చెబుతూ, “ఆమె తల్లిదండ్రులతో కలిసి ఆ రోజును జరుపుకోవాలనుకుంది. ఆ రోజంతా కుటుంబంతోనే గడిపింది. అందరూ వేడుకలకు వచ్చారు. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని గద్గద స్వరంతో గుర్తు చేసుకున్నారు.
“నాన్న, నువ్వు ఉద్యోగం మానేయ్.. నేను చూసుకుంటా”
దీపాన్షి తన తండ్రికి చేసిన ఒక వాగ్దానం ఆమెను తెలిసిన వారందరినీ వెంటాడుతోంది: “నాన్న, నా చదువు పూర్తి కాగానే, నువ్వు ఈ ఉద్యోగం మానేయొచ్చు. నేను అన్నీ చూసుకుంటాను.” దీపాన్షి తన తండ్రికి అండగా, తన తమ్ముడు శౌర్యకు గర్వంగా నిలిచిన ఒక ధైర్యవంతురాలైన, సంతోషంగా ఉండే అమ్మాయి అని ఆమె స్నేహితులు గుర్తు చేసుకున్నారు. చివరిసారిగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన తల్లిదండ్రులతో కలిసి సెల్ఫీ తీసుకున్న తర్వాత, దీపాన్షి ఎయిర్ ఇండియా విమానం AI 171 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌ను ఎక్కింది. 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆ విమానం, టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే మెఘానీనగర్‌లోని అతుల్యం కాంప్లెక్స్‌పై కూలిపోయింది. ఈ వార్త వారి ఇంటికి చేరేసరికే, ఆ కుటుంబం ప్రపంచం తలకిందులైపోయింది.





