- శాంతిభద్రతలు బలంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం
- పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను గుంటూరులో ప్రారంభించిన సీఎం
- ఏఐని సమర్థంగా వాడితే ‘జీరో క్రైం’ సాధ్యమే!
గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను ప్రారంభించిన ఆయన, ఐటీ కంపెనీలు, ఏఐ నిపుణులతో ముఖాముఖి భేటీ అయ్యారు. శాంతిభద్రతలు సరిగా ఉన్నచోటే అభివృద్ధి జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఐటీ వల్లే దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని చంద్రబాబు గుర్తుచేశారు. దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రౌడీయిజం, నక్సలిజం, స్మగ్లర్లను కట్టడి చేశామని అన్నారు. “సీబీఎన్ ఉన్నంతవరకూ నేరస్థులకు చోటు లేదు” అని హెచ్చరించారు. సాంకేతికతతో పాటు సంఘ విద్రోహశక్తులపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు.
ఏఐ భవిష్యత్తు: డ్రోన్ సిటీ, స్పేస్ సిటీకి ప్రణాళిక!
క్వాంటం వ్యాలీ కింద ఏఐకి ప్రాధాన్యం ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ఏఐ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సత్తా చాటాలని ఆకాంక్షించారు. “ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమే” అని యువతకు భరోసా ఇచ్చారు. ఆగస్టు 15 నుండి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే ధ్రువపత్రాలు పొందవచ్చని ప్రకటించారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. “రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేస్తే ప్రపంచాన్ని జయించే పరిస్థితి వస్తుంది” అని అన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నామని సీఎం తెలిపారు. భవిష్యత్తులో ఏదైనా విపత్తు వస్తే డ్రోన్ ద్వారా వారికి సాయం అందిస్తామని చెప్పారు. ప్రజల డేటాను ఏఐ సాయంతో విశ్లేషించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గతంలో ఐటీ గురించి మాట్లాడినట్లే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రపంచానికి నాయకత్వం వహించే సత్తా భారతీయులది అని, మన యువతే నాయకత్వం వహించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. “థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ” నినాదాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని, దీని కోసం తనతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఏఐ విషయంలో ఇది ఆరంభం మాత్రమే అన్నారు.
టెక్నాలజీతో ‘జీరో క్రైం’: వివేకా హత్యపై పరోక్ష విమర్శలు!
ర్యాపిడో వ్యవస్థాపకులు మన గుంటూరుకు చెందినవారే అని చంద్రబాబు గుర్తుచేశారు. యాప్ ద్వారా ఆటోలను అనుసంధానం చేసి ప్రయాణ సేవలు అందిస్తున్నారని, ఇప్పుడు అది బిలియన్ డాలర్ల కంపెనీగా మారిందని చెప్పారు. వినూత్నంగా ఆలోచిస్తే ప్రపంచాన్ని శాసించే అవకాశం వస్తుందని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని, టెక్నాలజీ ద్వారా ‘జీరో క్రైం’ సాధ్యమని చెప్పారు.
“ఆడబిడ్డలను వేధిస్తే అదే వారికి చివరి రోజు కావాలి” అని సీఎం హెచ్చరించారు. మాజీ సీఎం వివేకానందరెడ్డి హత్యలో అసలు విషయం గూగుల్ టేకౌట్ ద్వారా బయటకొచ్చిందని పరోక్షంగా విమర్శించారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకుంటే ఫలితాలు వస్తాయని అన్నారు. “మాజీ సీఎం తెనాలికి వచ్చి గంజాయి బ్యాచ్‌ను పరామర్శించారు. ప్రజలను వేధించే వారిని అలాగే వదిలేయాలా. బాబాయ్‌ని చంపి ఎన్ని నాటకాలు ఆడారో మీరు చూశారు. టీవీల్లో గుండెపోటు, పోస్ట్ మార్టం తర్వాత గొడ్డలి పోటు అయింది. తెల్లారే సరికి ఆ కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఆ రోజే హంతకులను అరెస్టు చేయకపోవడం తప్పు. అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులు కారు. ఒకప్పుడు రౌడీ పక్కన నిలబడాలంటే రాజకీయ నాయకులు సిగ్గు పడేవారు. ఇప్పుడు రౌడీలు రాజకీయ నాయకులుగా మారారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు” అని చంద్రబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





