• లూథియానాలో ఖాళీ స్థలంలో డ్రమ్‌లో కుళ్లిపోయిన మృతదేహం
• 35–40 ఏళ్ల వయసున్న మగవాడిగా గుర్తింపు
• ఈ కేసు మీరట్‌లోని డ్రమ్ మర్డర్‌ను గుర్తు చేస్తోంది
పంజాబ్‌లోని లూథియానాలో దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. షేర్‌పూర్ ప్రాంతంలోని ఓ ఖాళీ స్థలంలో డ్రమ్‌లో పడేసిన స్థితిలో ఒక మగవారి కుళ్లిపోయిన శరీరం దొరికింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డ్రమ్‌ను తెరిచి చూడగా, అందులో ప్లాస్టిక్, గోనెసంచిలో చుట్టిన మృతదేహం కనిపించింది. శరీరంపై తాడుతో బిగించి ఉన్నట్టు కనిపించింది. గాయాలు ఉండటంతో ఇది స్పష్టంగా హత్యగా గుర్తించారు. ఈ సంఘటన మీరట్‌లో గతంలో జరిగిన ప్రముఖ ‘బ్లూ డ్రమ్ మర్డర్’ కేసును గుర్తుకు తెస్తోంది. అక్కడ ఒక మర్చంట్ నేవీ అధికారి సౌరభ్‌ను అతని భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి డ్రమ్‌లో వేసి, సిమెంట్ పోసి దాచిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అతని కుమార్తె “నాన్న డ్రమ్‌లో ఉన్నారు” అని చెప్పడంతో కేసు మలుపు తిరిగింది.
ఇక లూథియానా కేసులోనూ మృతుడి పైన చాలా రోజుల క్రితమే హత్య జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. బాడీ పూర్తి స్థాయిలో కుళ్లిపోవడంతో గుర్తింపు కష్టంగా మారింది. పోలీసులు గుర్తు తెలియని నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు పరిణామాలు చూస్తుంటే, ఇది కూడా ప్లాన్ చేసి హత్య చేసిన ఘటనగా అనుమానం గాఢమవుతోంది.





