- భూములపై క్లిక్ చేస్తే యజమాని వివరాలు, హద్దులు, ప్రయోజనాలూ స్పష్టంగా
- అక్రమాల నిర్ధారణ, సాగు నీటి విశ్లేషణకు కూడా ఉపయోగపడనున్న సరికొత్త వెర్షన్
రాష్ట్రంలోని భూములపై స్పష్టత ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రానుంది. ఇంటి భూమా, వ్యవసాయ భూమా, లేక చెరువు, వాగు — ఏదైనా కావొచ్చు… ఇకపై ఒకే వేదికలో ఓ క్లిక్‌తో అన్నీ కనిపించబోతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త వెబ్‌ల్యాండ్ సిస్టమ్‌కి ‘భూ దర్శిని’ అనే పేరు పెట్టింది. దేశంలోనే తొలిసారిగా ఈ విధమైన ఆవిష్కరణను తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రంలోని 6,690 గ్రామాల్లో రీసర్వే పూర్తి అయింది. డ్రోన్‌లు, ఉపగ్రహ చిత్రాల ఆధారంగా మ్యాపులు రూపొందించి వాటిని వెబ్‌ల్యాండ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మ్యాప్‌లు 5 వేర్వేరు రంగుల్లో భూముల స్వభావాన్ని చూపేలా రూపొందిస్తున్నారు. అంతే కాదు… ఆయా భూములపై క్లిక్ చేస్తే యజమాని పేరు, సర్వే నంబర్, విస్తీర్ణం, భూమి స్వభావం వంటి వివరాలన్నీ వెంటనే కనిపిస్తాయి.
రైతులకే కాదు… వ్యవసాయం, పరిశ్రమలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగకరం
ఈ కొత్త విధానం వల్ల చాలా లాభాలున్నాయి. ప్రభుత్వ భూములపై ఎవరో అక్రమంగా కబ్జా చేస్తే, అది ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. అలాగే, చెరువులు, సాగు నీరు ఎక్కడెక్కడ ఉందో చూడొచ్చు. వ్యవసాయం చేయాలనుకునే వారు, పరిశ్రమలు పెట్టాలనుకునే వారు ఆ ప్రాంత భూమి రకం, సాగు తీరులపై ముందస్తుగా అవగాహన పొందొచ్చు. అంతేకాదు, ఈ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నూతన పట్టాదారు పుస్తకాలు ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయనున్నారు. వాటిలో QR కోడ్ ఉండి, దాని ద్వారా నేరుగా భూమి లొకేషన్‌కు వెళ్లే నావిగేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. గత ప్రభుత్వంలో ముద్రించిన పుస్తకాల్లో నేతల ఫొటోలను తొలగించి, ఇప్పటివే రాజముద్రలతో పుస్తకాలు వస్తున్నాయి.





