- దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతి.
- రంగస్థలం నుంచి పద్మశ్రీ వరకు… ఆయన సినీ ప్రస్థానం తెలుగు వారికి ఎప్పటికీ గుర్తుంటుంది.
తెలుగు సినీ అభిమానులను కలిచివేసే వార్త. విలక్షణ నటుడు, ‘నటశేఖరుడు’ కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కోట మరణం తెలుగు సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచింది. కోట శ్రీనివాసరావు 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో పుట్టారు. 1968లో రుక్ష్మిణిని పెళ్లాడారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. దురదృష్టవశాత్తు, ఆయన కొడుకు కోట ప్రసాద్ 2010 జూన్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.
బ్యాంకు ఉద్యోగి నుంచి పద్మశ్రీ వరకు… కోట ప్రస్థానం!
సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లు ప్రేక్షకులను అలరించిన ఆయన, 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. కెరీర్ మొదట్లో సహాయ నటుడిగా, ఆ తర్వాత ప్రతినాయకుడిగా విభిన్నమైన పాత్రల్లో కనిపించి తనదైన ముద్ర వేశారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన నటుడిగా కోట శ్రీనివాసరావుకు మంచి పేరు వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లాంటి అగ్ర, యువ హీరోలతో ఆయన కలిసి పనిచేశారు.
కోట శ్రీనివాసరావుకు తొమ్మిది నంది పురస్కారాలు దక్కాయి. ‘ప్రతిఘటన’ (1985), ‘గాయం’ (1993), ‘తీర్పు’ (1994), ‘లిటిల్ సోల్జర్స్’ (1996), ‘గణేష్’ (1998), ‘చిన్న’ (2000), ‘పృథ్వీ నారాయణ’ (2002), ‘ఆ నలుగురు’ (2004), ‘పెళ్లైన కొత్తలో’ (2006) చిత్రాలకు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. 2012లో ‘వందే జగద్గురుమ్’ సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు. తెలుగు సినిమాకు చేసిన సేవలకు గాను 2015లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కోట పద్మశ్రీ అందుకున్నారు. ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలలో కొన్ని: ‘అహనా పెళ్ళంట!’, ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నం: 786’, ‘శివ’, ‘బొబ్బిలిరాజా’, ‘యమలీల’, ‘సంతోషం’, ‘బొమ్మరిల్లు’, ‘అతడు’, ‘రేసు గుర్రం’ లాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి.కోట శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భాజపా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన మరణం తెలుగు సినీ లోకానికి తీరని లోటు.





