- సెప్టెంబర్ 2న బెంగళూరులో ఆపిల్ తన మూడో స్టోర్‌ను ప్రారంభించనుంది.
- భారత్‌లోని ప్రధాన నగరాలపై ఆపిల్ దృష్టి.. ఇప్పటికే ముంబై, ఢిల్లీలలో స్టోర్లు.
- కొత్త స్టోర్‌లో టెక్ నిపుణుల నుంచి సహాయం, ఫ్రీ ఎన్‌గ్రేవింగ్ లాంటి ఆఫర్లు.
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ భారత్‌లో తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో స్టోర్లను తెరుస్తూ.. తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా బెంగళూరులో మూడో స్టోర్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 2న బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ఈ స్టోర్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఆపిల్ ముంబైలో ఆపిల్ బీకేసీ, ఢిల్లీలో ఆపిల్ సాకేత్‌లను ప్రారంభించింది. ఇప్పుడు బెంగళూరులో ఆపిల్ హెబ్బాల్‌ను ప్రారంభించడం ద్వారా, ఆపిల్ భారత్‌లోని అతిపెద్ద నగరాల్లో తమ ఉనికిని పటిష్టం చేసుకుంటోంది.
కొత్త స్టోర్‌లో ప్రత్యేకతలు..
ఈ కొత్త స్టోర్ లో వినియోగదారులకు అనేక సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆపిల్ నిపుణుల (Apple Specialists) నుంచి హ్యాండ్స్-ఆన్ సహాయం పొందవచ్చు. అలాగే, మీ ఆపిల్ డివైజ్‌లతో కొత్త నైపుణ్యాలు, క్రియేటివ్ టిప్స్ నేర్చుకోవడానికి ‘టుడే ఎట్ ఆపిల్’ సెషన్లలో పాల్గొనవచ్చు. సాంకేతిక సమస్యలకు పరిష్కారం, రిపేర్ల కోసం జీనియస్ బార్‌ను ఏర్పాటు చేశారు. కొత్తగా కొనే ఉత్పత్తులపై ఉచిత ఎన్‌గ్రేవింగ్ సదుపాయం కూడా ఇక్కడ ఉంది.
నగరవాసుల కోసం స్పెషల్ గిఫ్ట్..
బెంగళూరు స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆపిల్ సంస్థ నగరానికి ప్రత్యేక బహుమతి ఇచ్చింది. ఆపిల్ హెబ్బాల్ పేరుతో బెంగళూరు నేపథ్యం ఉన్న ప్లేలిస్ట్‌ను విడుదల చేసింది. అలాగే, బెంగళూరు థీమ్‌తో కూడిన వాల్‌పేపర్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.





