- బిహార్‌లో జరుగుతున్న ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు.
- ముజఫర్‌పుర్‌లో రాహుల్ గాంధీ బైక్ నడుపుతుండగా, ప్రియాంక వెనుక కూర్చున్నారు.
- ఈ యాత్ర బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాగుతోంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముజఫర్‌పుర్‌లో జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ బైక్ నడిపారు. ఆయన వెనుక ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూర్చున్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ బైక్ ర్యాలీలో రాహుల్, ప్రియాంకతో పాటు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్, ఇతర ‘ఇండియా కూటమి’ నేతలు కూడా పాల్గొన్నారు. ఆగస్టు 17న బిహార్‌లోని ససారామ్‌లో ప్రారంభమైన ఈ యాత్ర, మొత్తం 1300 కిలోమీటర్లు సాగి సెప్టెంబర్ 1న ముగుస్తుంది. ఈ యాత్రలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా పాల్గొన్నారు. మంగళవారం దర్భంగాలో జరిగిన ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, రాజ్యాంగ పరిరక్షణకు ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు. అలాగే, అధికార పార్టీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు.
ఓట్ల తొలగింపుపై వివాదం..
ఈ ఏడాది చివర్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో సవరణలు చేపట్టింది. ఈ ప్రక్రియలో 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడంతో విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఓటర్ అధికార్ యాత్ర’ ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది.





