ప్రఖ్యాత నిర్మాత బోనీ కపూర్ ఇటీవల తన కలల ప్రాజెక్ట్ అయిన ‘మైదాన్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఏకంగా రూ.90 కోట్లు ఎక్కువగా ఖర్చయిందని, దీనివల్ల అప్పు చేయాల్సి వచ్చిందని ఒక తాజా ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
‘మైదాన్’ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం కోవిడ్ రాకముందే పూర్తయిందని బోనీ కపూర్ చెప్పారు. అయితే, మిగిలిన కొన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లు షూట్ చేయడానికి అంతర్జాతీయ టీమ్‌లు వచ్చాయి. అదే సమయంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో, వారిని కొన్ని నెలల పాటు ముంబైలోనే ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో కోవిడ్ నిబంధనల వల్ల ఖర్చు విపరీతంగా పెరిగిందని బోనీ కపూర్ వివరించారు. షూటింగ్ సమయంలో సుమారు 800 మంది సెట్స్‌లో ఉండేవారని, తాజ్ హోటల్ నుంచి భోజనం తెప్పించేవారని చెప్పారు. అలాగే, నాలుగు అంబులెన్స్‌లు, వైద్యులను అందుబాటులో ఉంచాల్సి వచ్చిందని తెలిపారు. సామాజిక దూరం పాటించడం కోసం ఎక్కువ టెంట్లు కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
“ఒక చిన్న సినిమా తీయొచ్చు”
నీళ్ల బాటిళ్ల ఖర్చు గురించి చెబుతూ బోనీ కపూర్, “మంచి నీళ్ల బాటిళ్లకు కేటాయించిన బడ్జెట్‌తో ఒక చిన్న సినిమానే తీయొచ్చు” అని అన్నారు. ఈ అదనపు ఖర్చుల వల్ల సినిమా బడ్జెట్ అదుపు తప్పిందని, కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో అప్పుల పాలయ్యానని ఆయన బాధపడ్డారు. అయినప్పటికీ, ‘మైదాన్’ తన జీవితంలో ఒక చేదు జ్ఞాపకాలను మిగిల్చినప్పటికీ, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన పేర్కొన్నారు.





