
విద్యని ఎవరూ దొంగిలించలేరు.. అదొక్కటే సమాజంలో ఉన్నతమైన మార్పుని తెస్తుందని ఇద్దరు విద్యార్థినులు నమ్మారు.. దాన్నే సామాజిక బాధ్యతగా తీసుకున్నారు. ఓ సంకల్పాన్ని పెట్టుకుని సమాజసేవ చేస్తున్నారు. బ్లూ లిలాక్ పేరుతో ఓ నాన్ ఫ్రాఫిట్ సంస్థని స్థాపించి లక్షల మంది అర్హుల జీవితాలకు విద్య రూపంలో వెలుగులు నింపుతున్నారు అదితి శ్రీవాత్సన్, నేహా గోవిందరాజన్. ఇద్దరిదీ చెన్నై. సమాజానికి ఏదైనా చేయాలంటే.. ఎప్పుడో సెటిల్ అయ్యే వరకూ వెయిట్ చెయ్యక్కర్లేదు. చదువు కుంటూనే సాధ్యమైన మేర సమాజంలో మార్పు తీసుకురావాలని ఇరువురూ నమ్మారు. అంతే.. చదువుకు అవకాశాలు లేకుండా ఉన్న పిల్లలకు పుస్తకాలు అందించడమే వారి మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యనైతే ఎవరూ దొంగలించలేరని.. అది దొరకని చోటుకి చేరుకుని తగిన సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
సంస్థ ప్రారంభమైన తర్వాత కొన్ని నెలల్లోనే ఇద్దరు కాస్త ముగ్గురయ్యారు. తనుశ్రీ కలయికతో విరాళాలు సేకరించేందుకు రంగంలోకి దిగారు. అదితి నిర్వహణపరమైన పనులను చూసుకుంటే, నేహా, తనుశ్రీ పుస్తక విరాళాల డ్రైవ్‌లను విజయవంతంగా నిర్వహించారు. “మొదటి పుస్తక విరాళం ఎప్పటికీ మేం మరిచిపోలేం!! ఆ ప్రయత్నం మాకెంతో సంతృప్తిని ఇచ్చందని’’ వీరు చెబుతున్నారు. గతేడాది వేసవిలో స్టార్ట్ చేసి.. ఇప్పటికి 6 పుస్తకాల లైబ్రరీలు నిర్మించారు. 4,700 పుస్తకాలు పాఠశాలలకు విరాళంగా ఇచ్చారు. సుమారు 3,000 మందికిపైగా విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు.

బ్లూ లిలాక్ టీమ్ ఇప్పుడు వారి సేవల పరిధిని విస్తరించడానికి సిద్ధమైంది. పుస్తకాల విరాళాలతో పాటు, విద్యార్థుల్లోని నైపుణ్యాల్ని మెరుగుపరిచే శిక్షణా తరగతుల్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వర్క్ షాప్స్ తో విద్యార్థుల్లో దాగున్న క్రియేటీవ్ ఆలోచనలు, సామర్థ్యాల్ని వెలికి తీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. “సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని కోరుకునే ప్రతిఒక్కరికీ మేం వెల్కమ్ చెబుతున్నాం. రండి.. మాతో చేతులు కలపండి. పుస్తక విరాళం లేదా కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా మీరు కూడా మార్పు తీసుకురాగలరు,” అని ఈ ముగ్గురు అమ్మాయిలు పిలుపునిస్తున్నారు. మరిన్ని వివరాలకు https://bluelilacchennai.weebly.com సైట్ ని చూడొచ్చు.





