తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) శ్రీవారి భక్తులకు శుభవార్త ప్రకటించింది. 2025 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు మరియు డైరీలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో, పోస్టల్ విధానంలో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండగా, ఇప్పుడు భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి క్యాలెండర్లు మరియు డైరీలను పొందవచ్చు. 2025 సంవత్సరానికి 12 పేజీలు, 6 పేజీలు, సింగిల్ షీట్, టేబుల్ టాప్ క్యాలెండర్లను అందుబాటులో ఉంచారు.శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు శ్రీ పద్మావతి అమ్మవారి ఫొటోతో రూపొందించిన క్యాలెండర్లు, డీలక్స్ డైరీలు, చిన్న డైరీలను కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. క్యాలెండర్లు మరియు డైరీలు కావాల్సిన వారు అధికారిక వెబ్‌సైట్‌లు ద్వారా బుక్ చేసుకోవచ్చు. అలాగే, తిరుమల, తిరుపతి, హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల్లోని ప్రముఖ బుక్ స్టోర్లలో నేరుగా కూడా కొనుగోలు చేయవచ్చు. క్యాలెండర్‌ను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలో వివరించిన ప్రకారం, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి లాగిన్ చేసి, అవసరమైన ఐటెమ్స్‌ను ఎంపిక చేసుకుని పేమెంట్ చేయాలి.
ఎలా బుక్ చేసుకోవాలి?
ముందుగా https://ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
కుడివైపు పై భాగంలో లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి
లాగిన్ అయ్యాక ఆన్‌లైన్ సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది
ఈ ఆప్షన్‌లో కిందికి వస్తే డెయిరీలు/క్యాలెండర్లు/పంచాంగం ఆప్షన్ ఉంటుంది.
అనంతరం మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న డైరీ లేదా క్యాలెండర్ వంటి ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి.
ఇక్కడ మీరు భారత్‌లో నివసించే వారైతే.. ఐటెమ్ షిప్పింగ్ కోసం భారతదేశం ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
ఒకవేళ భారత నివాసి కాకపోతే.. ఇంటర్నేషనల్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.పూర్తి అడ్రస్ ఎంటర్ చేయాలి.
తర్వాత మీరు ఎంపిక చేసుకున్న ఐటెమ్స్‌ను బట్టి ధర చూపెడుతుంది.
తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేను ఉపయోగించి.. డబ్బు చెల్లించాలి.





