చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ ఎత్తగానే పలికే మొదటి మాట ‘హలో’. అలాగే కొత్తవారితో కూడా ‘హలో’ అని పలకరింపుతోనే మాటలు కలుపుతుంటాం. పరిచయాలకు, సంభాషణలకు తొలి మెట్టు అయిన హలో అనే పదం ఎలా పుట్టింది? మన వాడుకలోకి ఎలా వచ్చింది?
“హలో” అనేది holla, hollo అనే రెండు పదాల నుంచి వచ్చింది.. థామస్ అల్వా ఎడిసన్ కారణంగా ‘హలో’ అనేది పలకరింపు పదంగా ప్రాచుర్యం పొందింది.
ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ప్రకారం, హలో అనే పదం holla, hollo అనే రెండు పదాల నుంచి వచ్చింది. దూరంగా ఉన్న వ్యక్తిని పిలిచేందుకు ఈ పదాలను వాడేవారు. అమెరికన్-బ్రిటిష్ జర్నలిస్ట్ బిల్ బ్రిసన్ ప్రకారం, హలో అనేది ‘hale be thou’ అనే ఓల్డ్ ఇంగ్లిష్ పదబంధం నుంచి వచ్చింది. దీని అర్థం ‘ఆరోగ్యంగా ఉండాలని ఆశించడం’. అలెగ్జాండర్ గ్రాహంబెల్ 1876లో టెలిఫోన్‌ను కనిపెట్టారు. టెలిఫోన్ వచ్చిన తొలినాళ్లలో ఫోన్‌లో సంభాషణ మొదలుపెట్టడానికి ఒక నిర్ధిష్ట పదం లేదు. గ్రాహంబెల్ ‘అహోయ్’ అనే పదం వాడాలని భావించారు. కానీ, థామస్ అల్వా ఎడిసన్ కారణంగా ‘హలో’ అనేది పలకరింపు పదంగా ప్రాచుర్యం పొందింది. టెలిఫోన్ డైరెక్టరీలలో టెలిఫోన్‌ను ఎలా ఉపయోగించాలో సూచనలు ఇచ్చేవారు. అలాగే సంభాషణను హలో అంటూ మొదలుపెట్టాలని సూచించేవారు.
నేటి తరం పలకరింపులు
కాలం మారుతున్న కొద్దీ ఫోన్ పలకరింపుల్లో మార్పులు వచ్చాయి. నేటి యువతరం వాట్సాప్ బ్రో, హేయ్, హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ తమవారిని పలకరిస్తున్నారు. కాల్ సెంటర్ ఉద్యోగులు గుడ్ మార్నింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటూ సంభాషణను మొదలుపెడుతున్నారు. కానీ, సాధారణ సంభాషణల విషయానికొస్తే మాత్రం హలో అనే పదమే నిలిచిపోయింది.





