ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీకి ముందుగా ఇంగ్లాండ్ జట్టు భారత్ పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. బీసీసీఐ త్వరలోనే ఈ రెండు సిరీస్‌లకు జట్లను ప్రకటించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ప్రాథమిక జట్టునే ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో ఆడించే అవకాశం ఉంది.
హార్దిక్, శ్రేయస్, అర్ష్‌దీప్‌కు అవకాశం
దేశవాళీ క్రికెట్లో ఫామ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్‌లను వన్డే సిరీస్ జట్టులోకి తీసుకోనున్నారు. శ్రేయస్ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రొవిజనల్ జట్టును జనవరి 12లోగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ఫిబ్రవరి 13వరకు మార్పులకు అవకాశం ఉంది.
బుమ్రాకు విశ్రాంతి
పనిభారం దృష్ట్యా బుమ్రాను ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు రెస్ట్ ఇచ్చే యోచనలో ఉంది బీసీసీఐ. ఆసీస్ పర్యటనలో బుమ్రా 151.2 ఓవర్లు వేసిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించనున్నారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ జనవరి 22న మొదలవుతుండగా, వన్డే సిరీస్ ఫిబ్రవరి 6న ప్రారంభమవుతుంది.






