- వల్లభనేని వంశీపై జరుగుతున్న దాడులపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
విజయవాడలో మీడియాతో మాట్లాడిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. వంశీని టార్గెట్ చేయడానికి అసలు కారణం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడమేనని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “వంశీ చంద్రబాబు కంటే గ్లామరస్‌గా ఉండటమే ఆయన టార్గెట్ కావడానికి కారణం. సొంత సామాజిక వర్గంలో ఒక వ్యక్తి ఎదుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేరు” అని అన్నారు. కొడాలి నాని విషయంలోనూ చంద్రబాబు ఇలాగే వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు.” లోకేష్ కన్నా దేవినేని అవినాష్ అందంగా ఉండటం కూడా ఆయన టార్గెట్ కావడానికి ఒక కారణం” అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు మాత్రమే ఆ సామాజిక వర్గంలో నాయకులుగా ఉండాలని కోరుకుంటారని, వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని అణగదొక్కుతారని ఆయన ఆరోపించారు. జగన్ ఇంకా మాట్లాడుతూ, “నాని, వంశీ, అవినాష్ వంటి నాయకులు చంద్రబాబును వ్యతిరేకిస్తే, వారిపై విమర్శలు చేయడం, కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ చంద్రబాబు, లోకేష్‌ల యొక్క అసలు స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి” అని అన్నారు.





