మిస్డ్ కాల్‌తో మొదలై.. మర్డర్‌తో ముగిసిన ప్రేమకథ!

  • ఒక మిస్డ్ కాల్‌తో ప్రేమ మొదలైంది.. పెళ్లి చేసుకోలేదని బెదిరించడంతో హత్యకు దారితీసింది.
  • బలరాంపూర్‌లో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన పోలీసులు.

ఒక మిస్డ్ కాల్‌తో మొదలైన ప్రేమ వ్యవహారం, చివరికి హత్యతో ముగిసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో జరిగింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి రాగిణి మృతదేహం జులై 9న బలరాంపూర్ సింగ్‌పూర్ గ్రామ సమీపంలో ఒక కాలువ పక్కన కనిపించింది. ఈ కేసులో ఆమె ప్రియుడు వినోద్ కుమార్ అరెస్టయ్యారు. పెళ్లికి నిరాకరించడంతో అత్యాచారం కేసు పెడతానని బెదిరించినందుకు రాగిణిని గొంతు నులిమి చంపినట్లు వినోద్ అంగీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ హత్య ఎమోషనల్ అటాక్ కాదు. కొన్ని వారాలుగా ఇద్దరి మధ్య ఉన్న గొడవల తర్వాత ప్లాన్ చేసి చేసిన నేరం. మూడు నెలల క్రితం రాగిణి తన తల్లికి ఫోన్ చేయబోయి పొరపాటున వినోద్‌కి కాల్ చేసింది. అలా మొదలైన పరిచయం సాధారణ ఫోన్ సంభాషణలకు దారితీసింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. జూన్ 24న రాగిణి బలరాంపూర్‌కు వచ్చి తన ఇంట్లో 15-16 రోజులు రహస్యంగా ఉంది వినోద్ విచారణలో ఒప్పుకున్నాడు.

పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతోనే హత్య!

ఈ పదిహేను రోజుల్లో రాగిణికి అప్పటికే పెళ్లయింది అని వినోద్‌కు తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న వినోద్ షాకయ్యారు. ఆ సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదు. రాగిణిని తన ఇంటికి తిరిగి వెళ్ళమని కోరాడు. అయితే, రాగిణి ఒప్పుకోలేదు. తనను పెళ్లి చేసుకోకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. “ఈ బెదిరింపు నన్ను ఇరుకున పడేసింది” అని వినోద్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. బలరాంపూర్ ఎస్పీ వికాస్ కుమార్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. జులై 8న వినోద్ రాగిణిని బయటకు వెళ్తున్నామని చెప్పి బలరాంపూర్ మార్కెట్‌కు తీసుకెళ్లారు. “ఆమెకు బట్టలు కొని, అవి వేసుకోమని చెప్పి, తిరిగి బయలుదేరారు. సింగ్‌పూర్‌లోని ఝర్‌హర్ దీహ్ కాలువ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి చేరుకున్నాక, వాహనం ఆపి ఆమెను కిందకు నెట్టి గొంతు నులిమి చంపారు” అని ఎస్పీ చెప్పారు.

సాక్ష్యాలు లేకుండా చేయడానికి వినోద్ మృతదేహాన్ని కాలువలో పడేశాడు. ఆమె ఫోన్‌ను ప్లాస్టిక్ షీట్‌లో చుట్టి పాతిపెట్టారు. ఆమె ధరించిన బట్టలను కూడా సమీపంలోని ఒక పొలంలో పాతిపెట్టాడు. రాగిణి కాల్ వివరాలు రికార్డులను పోలీసులు పరిశీలించారు. వినోద్‌తో ఆమె తరచుగా మాట్లాడినట్లు గుర్తించారు. వినోద్ పారిపోకముందే ఒక బృందం అతన్ని పట్టుకుంది. వినోద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, పోలీసులు అతని మోటార్‌సైకిల్, రాగిణి మొబైల్ ఫోన్, బట్టలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *