కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ఉద్దేశించి తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా, తమిళ నటుడు మరియు తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “కొంతమందికి అంబేడ్కర్ పేరు వినడమే నచ్చదు. ఆయన భారత్ పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి. అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్ అని ఆయన పేరు వినగానే మనసు సంతోషంతో నిండిపోతుంది,” అంటూ విజయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
తన తాజా రాజకీయ ప్రవేశంతో దళపతిగా గుర్తింపు పొందిన విజయ్, టీవీకే పార్టీ ద్వారా సామాజిక న్యాయానికి నడిచే దారిని చూపించనున్నట్లు తెలిపారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రజల కోసం పని చేయనున్నట్లు తెలిపారు. టీవీకే పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది.






